రెండో రోజు వైభవంగా మహాకుంభ సంప్రోక్షణ పర్వం
108 రుత్వికులతో లక్ష్మీనృసింహ
మూలమంత్ర జపాలు బింబ పరీక్ష..
మానోన్మాన శాంతి హోమం
ఉత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి, మార్చి 22 ;యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచ కుండాత్మక మహాయాగానికి అర్చక బృందం శ్రీకారం చుట్టింది. మంగళవారం ఉదయం బాలాలయంలో అరణీమథనంతో అగ్ని ఆవాహనం చేసి, యాగం ప్రారంభించింది. అంతకుముందు శాంతి పాఠం,అవధారణం, ద్వార తోరణ ధ్వజకుంభారాధన కొనసాగింది. మరోవైపు 108 మంది రుత్వికులు ప్రధానాలయం గర్భాలయం ముఖమండపంలో లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలు నిర్వహించారు. సాయంత్రం బింబ పరీక్ష, మానోన్మాన శాంతి హోమం జరిపారు. బాలాలయంలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, నవకలశ స్నపనం, లఘుపూర్ణాహుతిని చేపట్టారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ అనువంశికధర్మకర్త బి. నరసింహమూర్తి, ఈఓ గీత పాల్గొన్నారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాకుంభ సంప్రోక్షణలో ప్రధాన ఘట్టమైన సప్తాహ్నిక పంచకుండాత్మక మహాయాగానికి ఆలయ అర్చక బృందం శ్రీకారం చుట్టింది. కొండపై గుహలో స్వయంభువుడిగా వెలిసిన పంచనారసింహుడికి స్వయంభు అగ్నితో యాగాన్ని ప్రారంభించారు. ఉదయం 9 గంటలకు శాంతి పాఠం, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు నిర్వహించి అగ్ని మథనం గావించారు. అనంతరం బాలాలయంలో అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభించారు. విశేష యజ్ఞ హవనాలు, ప్రధానాలయంలో మూలమంత్ర, మూర్తి మంత్ర హోమాలు జరిగాయి. సాయంత్రం 5.30 గంటలకు బాలాలయంలో సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య విశేష హోమాలు, నవకలశ స్నపనం, నిత్య లఘుపూర్ణాహుతిని చేపట్టారు. ప్రధానాలయంలో బింబ పరీక్ష, మానోన్మాన శాంతి హోమాలు జరిపారు.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్య బాలాయంలో బ్రహ్మ ముహూర్తంలో నిత్యారాధనలు, నిత్యఅర్చనలు, నిత్య అభిషేకాల అనంతరం అర్చకబృందం విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం నిర్వహించింది. అనంతరం శాంతి పాఠంలో భాగంగా నాలుగు వేదాలు, రామాయణం, భాగవతం, మహాభారతం, పురాణం, స్తోత్రం, గానం, నృత్యం వంటి కార్యక్రమాలు చేపట్టారు. యాగశాలలో చతుస్థానార్చన నిర్వహించి, ద్వార తోరణం, ధ్వజకుంభారాధనలు చేపట్టారు. యాగశాలలో స్వయంభుమూర్తులు స్వామి, అమ్మవార్లకు స్వయంభు అగ్ని మథన కార్యక్రమం చేపట్టారు. జమ్మి, రాగి సాధనములను మథించి, స్వయంభువు మంత్రాలతో, క్రియాసాధనతో అఖండమైన తేజస్సులతో వచ్చిన స్వయంభు అగ్నితో పంచకుండాత్మక మహాయాగాన్ని ప్రధానార్చకులు ప్రారంభించారు. మహాయాగంలో విశేషమైన అధిష్ఠానదైవం, సంబంధమైన మంత్రాలతో, మూలమంత్రాలతో దశాంశ, శతాంశ, సహస్రాంశాది తర్పణాలతో నృసింహ భగవానుడి వైభవ పూర్వకమైన స్తోత్రాలతో బీజాక్షర ప్రయుక్త మంత్రాలతో విశేష హోమాలను నిర్వహించారు.
పంచసూక్త హవనం వంటి భగవత్ సంబంధమైన వేదమంత్రాలతో వాసుదేవ, సంకర్శణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, మహాలక్ష్మి అనే యజ్ఞకుండాలతో స్వాహాకార యజ్ఞం నిర్వహించారు. ఆగమశాస్త్రం బిగి, జిగి, విధి, విధానంగా యజ్ఞం సాగింది. స్వామివారిని బింబం, కుంభం, చక్రాబ్ది మండలం, అగ్నిలో ఆవాహనం చేస్తూ చతుస్థానార్చన చేపట్టారు. రాష్ట్రం, 14 లోకాలు సుభిక్షంగా ఉండాలన్న మహాసంకల్పంతో మహాయాగాన్ని ప్రారంభించినట్లు ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని అర్చకులు, పారాయణీకులు, అర్చకులకు పట్టు పంచెలను అందజేశారు.
ప్రధానాలయంలో 108 మంది రుత్వికులతోలక్ష్మీనృసింహ మూలమంత్ర జపం
యాదాద్రీశుడి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఉదయం ప్రధానాలయంలో లక్ష్మీనృసింహ మూలమంత్ర, మూర్తి మంత్ర జపాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది రుత్వికులచే మూలమంత్ర, మూర్తిమంత్ర జపాలను నిర్వహించారు. సంకల్పానికి వికల్పం లేకుండా 108 మంది రుత్వికులచే జపం చేయిస్తున్నామని తెలిపారు. 11 కోట్ల లక్ష్మీనృసింహ మూలమంత్ర జపం చేయించడమే ఈ యజ్ఞంలోని మహావిశేషమని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. ఈ మూలమంత్ర జపాలు మహాకుంభ సంప్రోక్షణ జరిగే వరకు రోజూ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్తవుతాయని వివరించారు. మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలతో యంత్రాలకు మహాబలం చేకూరుతుందన్నారు. దీంతో భక్తులకు స్వామివారు అభయవరప్రదానం చేస్తారని పేర్కొన్నారు.
సాయంకాలం బాలాలయంలో..
మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా సాయంత్రం 6 గంటలకు నిత్యారాధనలు అనంతరం బాలాలయంలో సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం నిత్య విశేష హోమాలు చేపట్టారు. ఉత్సవ యోగ్యత ఆపాదించుకునేందుకు నవకలశాలలో వివిధ నదీ జలాలను ఆవాహనం గావించారు. ఫల రసభరితమైన పదార్థాలతో ద్రవీభూతం గావించి తీర్థ రాజాలతో నవకలశ స్నపనం నిర్వహించారు.
ప్రధానాలయంలో బింబ పరీక్ష.. మానోన్మాన శాంతి హోమం..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో సాయంత్రం 6 గంటలకు బింబ పరీక్ష, మానోన్మాన శాంతి హోమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. శిలామయ మూర్తుల స్వరూపాలను ఆగమ శాస్ర్తానుసారంగా నిర్మించిన తీరును పరిశీలించారు. అనంతరం మానోన్మాన శాంతి హోమం చేపట్టారు. మూర్తుల్లోని కొలతలు, సమీకరణలు చూసి ఆయా మూర్తులకు ఆగమశాస్త్ర విధి పరీక్షలు గావించారు. ప్రతిష్ఠాయోగ్యతను ఆపాదించడానికి మంత్రపూజ గావించారు.