ఆలేరు టౌన్, సెప్టెంబర్ 16 : తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో భారత సైనిక బలగాల ముట్టడితో నిజాం నిరంకుశ పాలన నుండి సెప్టెంబర్ 17న తెలంగాణకు విముక్తి లభించిందని ఆయన తెలిపారు. అప్పటికే ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాట వీరులు నిజాం సంస్థానంపై యుద్ధాలు చేసి ప్రాణ త్యాగం చేశారన్నారు. అలాంటి మహానుభావుల చరిత్ర బయటకు రాకుండా ఓటు రాజకీయాల కోసం మరుగున పడవేశారన్నారు.
నిజాం నవాబులు చేసిన ఆకృత్యాలు, అరాచకాలను ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ ప్రకటించి ఆనాటి సాయుధ పోరాట యోధుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రచురించి నేటి తరానికి వారి పోరాటాన్ని తెలిపే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మోదీ జన్మదినం సెప్టెంబర్ 17ను మొదలుకుని అక్టోబర్ 2 గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని 15 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు ఆయనను బిజెపి శ్రేణులు శాలువాలు, పూలదండలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఫకీర్ రాజేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్ర శేఖర్ రెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు పూజారి కుమారస్వామి గౌడ్, నంద గంగేష్, జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కోశాధికారి సోమ నరసయ్య, జిల్లా కౌన్సిల్ మెంబర్ వడ్డేమాన్ నరేందర్, జిల్లా నాయకులు సముద్రాల శ్రీనివాస్, బందెల సుభాష్ జాలపు, సురేందర్ రెడ్డి బడుగు జాహంగీర్, ప్రధాన కార్యదర్శులు సుంకరి సృజన్, ఎలగల శేషత్వ, అమరేందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దయ్యాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు కంతి శంకర్, కళ్లెం రాజు, ద్వారపు రమణ, చుక్క రాజు, అయిలీ సందీప్, పడమటి స్వామి, మైదం భాస్కర్, పూల హనుమంతు, శివ, సంతోష్ పాల్గొన్నారు.