– తాజ్పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం, స్మార్ట్ టీవీ ప్రారంభం
– దాత, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్‌కు సన్మానం
భువనగిరి కలెక్టరేట్, జూన్ 13 : ప్రభుత్వ పాఠశాలల ఉపాధాయులు అంకితభావంతో పనిచేసి, నాణ్యమైన బోధనతో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని జడ్పీ సీఈఓ ఎన్.శోభారాణి అన్నారు. శుక్రవారం భువనగిరి మండలంలోని తాజ్పూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్ఎస్కే ఫౌండేషన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ర్యాకల శ్రీనివాస్ సొంత నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంలను, స్మార్ట్ టీవీలను డీఈఓ కె.సత్యనారాయణతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆమె కోరారు. ప్రైవేట్ పాఠశాలలకు చెల్లించే ఫీజులను తమ పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్ఠికాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
తాజ్పూర్ గ్రామంలోని పాఠశాల అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, పాఠశాలలో అధునాతన హంగులతో సకల సౌకర్యాలు ఉన్నట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనతో పాటు విద్యార్థులను అనునిత్యం ప్రొత్సహిస్తున్న దాత శ్రీనివాస్ కృషిని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు. లక్షల రూపాయలు తన సొంత నిధులను ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల కోసం వినియోగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. ప్రతి గ్రామంలో ర్యాకల శ్రీనివాస్ వంటి దాతలు ముందుండి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పాటుపడాలని కోరారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. డిజిటల్ క్లాస్ రూం, స్మార్ట్ టీవీల దాత ర్యాకల శ్రీనివాస్‌ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీహెచ్ శ్రీనివాస్‌రావు, ఎంఈఓ నాగవర్ధన్‌రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ర్యాకల సంతోషశ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వై.వెంకటేశ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ ఓరుగంటి రమ్య, పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, వివిధ పాఠశాలల ప్రదానోపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.