బీబీనగర్, జూలై 24 : పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. బీబీనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికారు. ఒకసారి వినియోగించి పారేసే డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులకు బదులుగా తమ సొంత స్టీల్ ప్లేట్లు, టీ గ్లాసులను ఉపయోగిస్తూ పర్యావరణహిత సందేశాన్ని ఆచరణలో చూపించారు. విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, సుస్థిర జీవన విధానాలపై బోధించే ఉపాధ్యాయులు, అదే విలువలను ముందుగా తామే పాటిస్తూ “ముందు మనం పాటిద్దాం… తర్వాత విద్యార్థులకు నేర్పిద్దాం” అనే సందేశాన్ని సమాజానికి అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే కాకుండా పర్యావరణహిత అలవాట్లపై అవగాహన పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు ఆదర్శప్రాయమైన చర్య తీసుకున్నారని పలువురు అభినందించారు.
ఈ చొరవ విద్యార్థులు, తల్లిదండ్రులు, సమాజంలో పర్యావరణ పరిరక్షణపై మరింత చైతన్యం కలిగిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ జీవశాస్త్ర ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొదిల విజయ ప్రతాప్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాశెట్టి విష్ణు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులకు నేర్పే మంచి అలవాట్లను ముందుగా ఉపాధ్యాయులే ఆచరిస్తే శాశ్వతమైన మార్పు సాధ్యమవుతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయుల ఈ వినూత్న కార్యక్రమం ఇతర జిల్లాలకు సైతం ఆదర్శంగా నిలవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీలు రాధారపు రాజు, మంగళంపల్లి రామ్మూర్తి, ఎర్రగుంట బాలకృష్ణతో పాటు జిల్లాలోని జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.