భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 16 : భూదాన్ పోచంపల్లి మండలంలోని భీమనపల్లి ప్రాథమికోన్నత పాఠశాల నుండి ఇద్దరు టీచర్లను డిప్యూటేషన్‌పై వేరే గ్రామానికి పంపిస్తున్నారని, డిప్యూటీషన్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ భీమనపల్లి గ్రామానికి చెందిన నాయకులు సిలువేరు శేఖర్, కంటే లింగస్వామి గురువారం ఎంఈఓ ప్రభాకర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సదుద్దేశంతో గ్రామస్తుల సహకారంతో ప్రైవేట్‌కు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్చడం జరిగిందన్నారు. పాఠశాలలో ఉన్న టీచర్లను డిప్యూటేషన్ పై పంపిస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యార్థుల భవిష్యత్ కోసం వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంటే రాములు, పి.వెంకటేశ్ పాల్గొన్నారు.