సంస్థాన్ నారాయణపురం, మే 27: సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను మంత్రి సీతక్క వెంటనే పరిష్కరించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Survi Yadaiah Goud) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తున్నదని, ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం కూడా ఒక పాపం అయిపోయిందని మండిపడ్డారు. గ్రామాలలో చేసిన అభివృద్ధి పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందించాలని సర్పంచుల సంఘం జేఏసీ పిలిపునిచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురంలో సర్పంచుల ఫోరం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు సర్పంచ్ల ఇండ్ల వద్ద కాపుగాసి అరెస్టు చేయడం చాలా దురదృష్టకరమని అన్నారు. శాంతియుతంగా గాంధీ మార్గంలో పెండింగ్ బిల్లుల పరిష్కారం చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా పరిష్కారం చేయకపోవడంతోపాటు సర్పంచులను అర్ధరాత్రి అరెస్టు చేసి నిర్బంధించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని చెప్పారు.
ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేయడం కూడా ఒక పాపమైపోయిందని, రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతోమంది సర్పంచులు అభివృద్ధి పనులు చేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుని మరణిస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పిన సర్పంచులకు పెండింగ్ బిల్లులు అందలేదు. కేవలం కాంట్రాక్టర్లకు ఎస్డీఎఫ్ బిల్లులు విడుదల చేసి, వాటిని సర్పంచ్ల పెండింగ్ బిల్లులు విడుదల చేశామని చెప్పుకోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు స్టేట్ ఫైనాన్స్ ఎస్ఎఫ్సీ నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కారం చూపకపోవడంతోపాటు అరెస్టులు చేయడం సిగ్గుమాలిన చర్య అని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పెండింగ్ బిల్లులపై సమీక్ష సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని కోరారు.