రాజాపేట, మే 23 : ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకుని విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఈఓ కందుల సత్యనారాయణ అన్నారు. రాజాపేట బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇక్కడ జరిగే 5 రోజుల శిక్షణ కార్యక్రమంను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు నిబద్ధతతో విధులు నిర్వహించాలని కోరారు. విద్యార్థులకు మంచి నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను బోధించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి దారాళంగా చదవాలని, గణిత పక్రియలు సులభంగా నేర్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అందుకు అనుగుణంగా భోదనా మెలకువలు ఈ శిక్షణ ద్వారా నేర్చుకోవాలన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలను తనదిగా భావిస్తూ విద్యార్థుల నమోదు పెంచాలన్నారు. ఎంఈఓ చందా రమేశ్ మాట్లాడుతూ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎం.శశికుమార్, జే.ప్రభాకర్, ఎంఆర్పీలు ఎన్.భరత్, జే.కరుణాకర్, జే.మహేందర్, ఎస్.శ్రీధర్, కె.నరేశ్, రాజేశ్వరి, కె.సరిత పాల్గొన్నారు.