భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 : పది రూపాయల కాయిన్ మింగి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అస్వస్థతతో విద్యార్థిని మృతి చెందిన సంఘటన శనివారం భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన ధ్యానమైన శేఖర్ – జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె నిహారిక (10) భీమనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నది. గురువారం సాయంత్రం బయట ఆడుకుంటుండగా పది రూపాయల కాయిన్ మింగింది. ఈ విషయమై తల్లిదండ్రులకు చెప్పడంతో చికిత్స కోసం విద్యార్థినిని వనస్థలిపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఆస్పత్రిలోని వైద్యులు నిహారికను పరీక్షించి ఆపరేషన్ చేసి కాయిన్ తొలగించారు. శుక్రవారం ఉదయం నిహారికను డిశ్చార్జ్ చేశారు. శనివారం ఉదయం నిహారికను నిద్ర నుంచి లేపేందుకు ప్రయత్నించగా ముఖమంతా ఆకుపచ్చ రంగుతో అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే బాలికను వనస్థలిపురంలోని ఆపరేషన్ చేసిన ఆస్పత్రికే తీసుకువెళ్లారు. నిహారికను పరీక్షించి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఆపరేషన్‌తో ఇన్ఫెక్షనై బాలిక మృతి చెందిందని పేర్కొంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.