యాదగిరిగుట్ట, జూలై 17 : కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారి రమణి అన్నారు. ఇందుకు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆమె తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయుల బోధన గురించి చర్చించారు. విద్యార్థిని, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ప్రణాళికతో చదువుకుని వార్షిక పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. బోధన పద్ధతులను పాటించి విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరారు. ఇటీవల సప్లిమెంటరీ పరీక్షలో పాసైన విద్యార్థులను కళాశాలలో చేర్పించే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మంజుల, కళాశాల అధ్యాపక బృందం, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.