భూదాన్ పోచంపల్లి, మే 26 : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అర్హతను మీరి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి డిప్యూటీ డీఎంహెచ్ఓ సుమన్ కళ్యాణ్ హెచ్చరించారు. మంగళవారం భూదాన్ పోచంపల్లిలోని బాలాజీ హాస్పిటల్ ను ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మెహర్ నగర్‌కు చెందిన సిరిపంగి రాములు నీరసంతో ఉండగా స్థానిక బాలాజీ హాస్పిటల్లో వైద్యురాలు రోగిని పరీక్షించి మోతాదుకు మించి మందులు ఇవ్వడంతో వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు బాలాజీ హాస్పిటల్ ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి ఆమెను అడిగి తెలుసుకున్నారు.
ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలని వైద్యురాలికి సూచించారు. ఏం చదివారు, ఎప్పటి నుండి పని చేస్తున్నారు. హాస్పిటల్లో డాక్టర్ ఎవరు, సర్టిఫికెట్లు ఏమున్నాయి. మెడికల్ షాప్ లోని వ్యక్తి ఫార్మసీ చదివిందా అని ప్రశ్నించారు. పూర్తిగా విచారణ చేపట్టి ఉన్నత అధికారులకు సమగ్ర నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. ఆయనతో పాటు మండల వైద్యాధికారిణి డాక్టర్ శ్రీవాణి, ఆరోగ్య కార్యకర్త రాపోలు లక్ష్మణ్ బాబు ఉన్నారు.