భూదాన్ పోచంపల్లి, జూన్ 18 : అర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేసేందుకు చర్యలు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపల్ లోని బసవలింగేశ్వర కాలనీలో 120 ఇండ్లు, జిబ్లక్పల్లిలో 36 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు, వాటి సమస్యల గురించి ఆరా తీశారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో ఆకతాయిలు కిటికీ అద్దాలు, సింథటిక్ ట్యాంకులు, ధ్వంసం చేయడంతో మైనర్ రిపేరింగ్ పనులు వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సొంతిల్లు లేని నిరుపేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వం అర్హులను పారదర్శకంగా ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలోనే అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్ రెడ్డి, తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్ గౌడ్, డిప్యూటీ తాసీల్దార్ నాగేశ్వర్రావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.