భువనగిరి అర్భన్, ఫిబ్రవరి 21 : వార్షిక పరీక్షల నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని యాదాద్రి భువనగరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నారా లేదా? ఎవరైనా గైర్హాజరు అవుతున్నారా అని ఆరా తీశారు. తదనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులను ఫిజిక్స్, గణితం సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి రెగ్యులర్ గా చదువాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున కష్టపడి చదవాలన్నారు.
సెలవుల్లో వాగులు, చెరువుల్లో ఈతకు వెళ్లి ప్రమాదాలు తెచ్చుకోకుండా, పరీక్షల మధ్యలో రెండు రోజులు కూడా పాఠశాలకు వచ్చి ప్రిపేర్ అవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. విద్యార్థులకి కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. రైస్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడంతో వెంటనే సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులకు ఫోన్ చేసి మంచి బియ్యం వెంటనే సరఫరా చేయాలని, మెనూ ప్రకారం విద్యార్ధులకు రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు.