ఆత్మకూరు(ఎం), జులై 05 : యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలోని కొరటికల్ చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలంలోని కొరటికల్ చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళలో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 4 వేల ట్రిప్పుల చెరువు మట్టిని గ్రామంతో పాటు ఇతర దూర ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. దీంతో చెరువులో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారిందన్నారు. అక్రమార్కులపై అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.