ఆలేరు టౌన్, ఆగస్టు 12 : దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న మతోన్మాద ఏజెండాకు ఎదురునిలిచిన యోధుడు, కమ్యూనిస్టు పార్టీలను ఐక్యం చేసే మహత్తర కృషి జరిపిన మేధావి సీతారాం ఏచూరి అని సీపీఎం ఆలేరు మండల కమిటీ కార్యదర్శి దూపటి వెంకటేశ్ అన్నారు. మంగళవారం ఏచూరి జయంతిని సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి ఒక గొప్ప రాజకీయ, సామాజిక, ఆర్థిక మేధావి అని కొనియాడారు.
భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, చెల్లా చెదురుగా ఉన్న బీజేపీయేతర పార్టీలన్నింటిని ఐక్యం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఏచూరిని దేశం కోల్పోవడం దేశ రాజకీయాలకు తీరని నష్టం అని అభివర్ణించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు సూదగాని సత్యరాజయ్య, జూకంటి పౌలు, నల్లమాస తులసయ్య, పిక్క గణేశ్, రావణ్, చౌడబోయిన యాదగిరి, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, గ్యార భాస్కర్, గ్యార అశోక్, దండు ఐలయ్య, రామచర్ల సిద్ధులు, అనిల్ పాల్గొన్నారు.