భువనగిరి అర్బన్, జూలై 17 : భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్ హైస్కూల్లో టీచర్ల కొరతను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు. శుక్రవారం సిపిఐఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బీచ్ మహల్ లోని ప్రభుత్వ నంబర్ టు, నంబర్ త్రీ స్కూళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఉన్నవారికైనా క్రీడా స్థలం లేదని, రెండు రూములలో ఒకటి నుండి ఐదు క్లాసుల విద్యార్థులకు ఒక హెడ్మాస్టర్, ఒక టీచర్ కలిసి పాఠాలు చెబుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు సరిగ్గా లేక తల్లిదండ్రులు తమ పిల్లలను పంపలేక పోతున్నారన్నారు.
గాంధీ నగర్లో ఉన్న ఖిలా కింద ఉన్న పాఠశాల నంబర్ టూ స్కూల్లో ఉపాధ్యాయులు ఉన్నారు, కానీ విద్యార్థులు అతి తక్కువగా ఉన్నారని, అయినా రోడ్డు దాటాలంటే తల్లిదండ్రులు భయపడి స్కూళ్లకు పంపించలేకపోతున్నారని వాపోయారు. హైస్కూల్లో హెడ్మాస్టర్ లేక ఇద్దరు టీచర్లు కూడా తక్కువ ఉన్నారు, కానీ స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్న చోట ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, విద్యార్థులు ఉన్నచోట ఉపాధ్యాయులను వెంటనే భర్తీ చేయాలన్నారు. అలాగే విద్యార్థులకు భోజనాలు సరైన క్రమంలో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ నాయకులు బర్ల వెంకటేష్, వల్దాస్ అంజయ్య, పర్వత్, బాలకృష్ణ, కొత్త లక్ష్మయ్య, మన్నె రాజు పాల్గొన్నారు.