– నెల రోజులుగా అందుబాటులో లేని డీపీటీ వ్యాక్సిన్
– సబ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న చిన్నారులు, తల్లిదండ్రులు
.బీబీనగర్ జూలై 26 : గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరతతో అంగన్వాడీ సెంటర్లు, సబ్ సెంటర్ల చుట్టూ చిన్నారులు, తల్లిదండ్రులు తిరుగుతున్నారు. ఐదు సంవత్సరాలు పైబడిన చిన్నారులకు డీపీటీ ( డిఫ్తీరియా, పెర్టుస్సిస్ టెటానస్ ) అనే వ్యాక్సిన్ వేయాల్సి ఉన్నా గత నెల రోజులుగా వ్యాక్సిన్ కొరత కారణంగా టీకాను వైద్యులు అందించలేకపోతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కొరత ఉన్నదని, సెంటర్లలో స్టాక్ లేనందున ఆరోగ్య కేంద్రాల్లో చిన్నారులకు టీకా వేయలేకపోతున్నామని ఆశా కార్యకర్తలు, ఏ ఎన్.ఎం లు తెలిపారు. కాగా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నది లేనిది సరైన సమాచారం లేక తల్లిదండ్రులు తమ పిల్లలను బడి మానిపించి సబ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.