భువనగిరి అర్బన్, జూలై 07 : భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ గార్డు కార్మికులకు నెలకు రూ.26 వేల కనీస వేతనం పెంచి ఇవ్వాలని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ అనుబంధ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అత్యవసర విభాగం ముందు జీతాలు పెంచాలని ధర్నా నిర్వహించిన అనంతరం సూపరింటెండెంట్ అరుణకుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ టెండర్ నిబంధనల ప్రకారం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలు, ఇతర చట్టబద్ధమైన సౌకర్యాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా అమలు చేయాలని, జాతీయ, పండుగ, ఆర్జిత సెలవులు ఇవ్వాలని కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సామల శోభన్ బాబు, జిల్లా కమిటీ సభ్యుడు బత్తుల సత్యం, మెడికల్ కాంట్రాక్ట్ కార్మికులు గుండు వాణి, ఎర్ర కృష్ణ, రాచకొండ పుష్ప, నర్సింహా, సులోచన, సోమనర్సయ్య, లలిత, హేమలత, భరతమ్మ, పద్మ, కలమ్మ, నరేష్ పాల్గొన్నారు.