– ప్రజావాణిలో యాదాద్రి కలెక్టర్కు రావిపహాడ్ సర్పంచ్ వినతి
బీబీనగర్, మే 25 : బీబీనగర్ మండలంలోని రావిపహాడ్ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ మేడబోయిన వెంకటేష్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. మగ్ధుంపల్లి నుండి రావిపహాడ్ తండా వరకు ఉన్న ప్రధాన రహదారి గత 16 ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోక గుంతలమయంగా మారిందని తెలిపారు. రహదారి అధ్వాన్నంగా ఉండడంతో ఆర్టీసీ బస్సు గ్రామానికి రావడం లేదని చెప్పారు. రావిపహాడ్, మాదారం గ్రామాలకు చెందిన సుమారు 40 నుండి 50 మంది విద్యార్థులు ప్రతిరోజూ విద్యాభ్యాసం కోసం ప్రయాణిస్తున్నారని, బస్సు సౌకర్యం లేక ఆటోలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.80 వరకు ఖర్చవుతోందని, ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్ రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
వెంటనే స్థల పరిశీలన చేసి సీసీ లేదా బీటీ రోడ్డు నిర్మించాలని కోరారు. అదేవిధంగా రావిపహాడ్, రావిపహాడ్ తండా ప్రస్తుతం వేర్వేరు గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పటికీ రేషన్ షాప్ మాత్రం తండాలోనే కొనసాగుతోందని తెలిపారు. దీంతో గ్రామ ప్రజలు సుమారు 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ రావిపహాడ్ గ్రామంలో కొత్త రేషన్ షాప్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బబిత బాల్రాజ్, రాసాల కమలమ్మ, మాజీ ఉప సర్పంచులు రాసాల శేఖర్, కొంతం భాస్కర్, కొసని వెంకటేష్, యంజాల బాల్రాజ్, గజ్జి మహేష్, కొసని సాయి, ఇంద్రియాల శివాజీ, మైలారం భరత్ పాల్గొన్నారు.