– ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్
– ఇద్దరికి తీవ్ర గాయాలు
బీబీనగర్, జనవరి 31 : బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు కార్మికులు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. ప్రమాదంలో హరి అనే వ్యక్తికి ఒక కాలు పూర్తిగా తెగిపోగా, బిలాల్ అనే వ్యక్తికి ఒక కాలు పూర్తిగా తెగిపోవడంతో పాటు మరో కాలు విరిగింది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని స్థానికులు వెంటనే బయటకు తీసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. ప్రాథమిక చికిత్స అందించి, క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.