అడ్డగూడూరు : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) అడ్డగూడూరు మండలం (Addagudur Mandal) లోని బొడ్డుగూడెం (Boddugudem) గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు (Woman teacher) ప్రాణాలు కోల్పోయింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన 53 ఏళ్ల జాబినా బేగం (Jabina Begum) మోత్కూర్ మండలంలోని దాచారం గ్రామంలో నివాసం ఉంటూ అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ (స్కూల్ అసిస్టెంట్) గా విధులు నిర్వహిస్తోంది.
మంగళవారం ఆమె అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్కు హాజరయ్యేందుకు దాచారం నుంచి తన స్కూటీపై బయలుదేరింది. ఈ క్రమంలో బొడ్డుగూడెం గ్రామ సమీపంలో ఆమె స్కూటీని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాబినా బేగం తల చిధ్రమైంది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
సమాచారం అందుకున్న అడ్డగూడూరు పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలికి భర్త ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు అడ్డగూడూరు ఎస్సై నాగరాజు తెలిపారు.