యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : భూదాన్ పోచంపల్లి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం, సఖ్యత లేకపోవడంతో రాజీనామాల వరకూ వెళ్లింది. తాజా గా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తడక వెంకటేశం రాజీనామా చేయడం హట్ టాపిక్‌గా మారింది. ఆయనకు మద్దతుగా మరికొందరు తమ పదవులకు గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రెడ్డి నాయకులకే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడినా పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేస్తున్నా రు. పట్టణంలో పలువురు కాంగ్రెస్ నేత లు, శ్రేణులు మంగళవారం సమావేశం అవడం తో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
బ్లాక్ కాంగ్రెస్ పదవికి తడక వెంకటేశ్వర్లు సోమవారం రాజీనామా చేశారు. 30 ఏండ్లుగా ఆయన పార్టీని అంటి పెట్టుకుని పని చేస్తున్నారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా అంకిత భావంతో పని చేసి, కార్యకర్తలకు అండగా నిలిచారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయన భార్య తడక లతను రెండు సార్లు సర్పంచ్‌గా గెలిపించుకున్నారు. గతంలో పోచంపల్లికి ఉప సర్పంచ్‌గా, కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా పని చేశారు. కొంత కాలంగా ఆయనకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దూరం పెడుతున్నారనే ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సమయం కేటాయించే వారని, ఇప్పుడు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలు ఎకడ జరిగిన పార్టీ బాధ్యులకు సమాచారం లేకపోవడం, అందరినీ భాగస్వాములను చేయకపోవడం, స్థానిక ఎమ్మెల్యే చూసీచూడనట్టు వ్యవహరించడంతో ముఖ్య నాయకులు ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే ఏదో సాకులు చెప్పి అంటీముట్టనట్లుగా ఉంటున్నారని, అందుకే వెంకటేశర్లు రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
రెడ్డి నాయకులకే పెద్ద పీట!
కుంభం ఎమ్మెల్యే అయ్యాక రెడ్డి వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎక్కడ కార్యక్రమాలు జరిగినా కొందరు మాత్రమే ఆయన చుట్టూ ఉంటున్నారని, వాళ్లు చెప్పిన మాటలే ఎమ్మెల్యే వింటున్నారని చర్చ నడుస్తున్నది. బీసీలను పెద్దగా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. దాంతో మంగళవారం భూదాన్‌పోచంపల్లిలో కాంగ్రెస్ పట్టణ నేతలు సమావేశమై ఎమ్మెల్యే తీరును ఖండించారు. తడక వెంకటేశానికి మద్దతుగా రాజీనామా పత్రాలను అందించారు.
రాజీనామా చేసింది వీరే..
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు భారత లవ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఒకటో వార్డు అధ్యక్షుడు దారెడ్డి భాసర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండ్ల నవనీత, నాలుగో వార్డు అధ్యక్షుడు కుక కుమార్, ఐదో వార్డు నుంచి మెరుగు యతీనందం, ఎనిమిదో వార్డు నుంచి సామల సుధాకర్ రెడ్డి, తొమ్మిదో వార్డు నుంచి కూరపాటి బాబు, పదో వార్డు నుంచి చేరాల మహేందర్, 11వ వార్డు నుంచి కర్నాటి బాలరాజు, 12వ వార్డు నుంచి వేముల ఆనంద్, 13వ వార్డులో గుండు ఉప్పలయ్య, ఎన్ఎస్యూఐ పట్ణాధ్యక్షుడు కుక అరుణ్ తమ పదవులకు రాజీనామా చేశారు.