బీబీనగర్, నవంబర్ 21 : బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో సొంత ఇండ్లు లేని పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కొండమడుగు గ్రామస్తులు శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండమడుగు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 900 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 57 మంది ఎంపికై ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాని లబ్ధిదారులు సుమారు 800 మంది ఉన్నారని, అందులో స్థలం లేని పేదలు ఎంతో మంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సర్వే నంబర్ 120లో 7.29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నదని అందులో పేద ప్రజలకు 70 గజాల స్థలం కేటాయించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో భుషపాక మల్లేశ్, కడెం సాయి ప్రసాద్, మంద శ్రీశైలం ఉన్నారు.