బీబీనగర్, సెప్టెంబర్ 16 : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎండీ.ఇమ్రాన్ పిలుపునిచ్చారు. మంగళవారం సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా బీబీనగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో కొమ్మిడి కోదండరాంరెడ్డి, స్వాతంత్ర సమరయోధుడు కొలను శివారెడ్డి విగ్రహాలకు, రాఘవపురం గ్రామంలోని జంగా ఎల్లయ్య, వంగరి సీతయ్య స్తూపాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 సెప్టెంబర్ 11న రావి నారాయణరెడ్డి, బుద్ధం ఎల్లారెడ్డి, మాఖ్దుం మొయినుద్దీన్ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రోజు నిజాం తాబేదారులుగా, జాగీర్దారులు, దొరలు, దేశముఖ్‌లు, భూస్వాములు, విచ్చలవిడిగా దోపిడీ దౌర్జన్యాలు చేపట్టిన చాకిరికి వ్యతిరేకంగా సమరశంఖం పూరించారన్నారు.
4 వేల మంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిజాం రాజుని గద్దె దించి తెలంగాణను భారత యూనియన్‌లో విలీనం చేశారని, నాటి కమ్యూనిస్టు నాయకుల పోరాట ఫలితంగానే 10 లక్షల ఎకరాల భూమి ప్రజల సొంతమైందన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన పోరాటాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వక్రీకరిస్తుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కాశపాక దయాకర్, సహాయ కార్యదర్శి సార కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయి వెంకటేశ్, ఉప్పునుతల నర్సింహా, చీరె అంజయ్య, కడెం బీరప్ప, వడ్డె సాయిలు, చేరే కిష్టయ్య పాల్గొన్నారు.