మోత్కూరు, జులై 10 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే ప్రాణ త్యాగాలకైనా తాము సిద్ధమేనంటూ మోత్కూరు మండలంలోని కొండగడప గ్రామ రైతులు ఆందోళన చేశారు. గురువారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎడ్ల బండ్లతో వినూత్నంగా నిరసన తెలిపారు. బిక్కేరు వాగు నుంచి ఇసుకను తరలించకూడదంటూ 2022లో హైకోర్డు ఉత్తర్వులను జారీ చేసిందన్నారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి తాసీల్దార్ జ్యోతి అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల అండదండలతో ఇసుక తరలింపునకు అనుమతులిచ్చిందని, ఆ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని గ్రామ రైతులు డిమాండ్ చేశారు.
జీవనోపాధి కోసం తాము ఎడ్ల బండ్లను కొనుగోలు చేసి ఇసుక బాడుగ చేసుకుని బతుకుతున్నట్లు తెలిపారు. తమను కాదని ట్రాక్టర్లతో ఇసుకను తరలించొద్దని కోరారు. ఇసుకను ఇందిరమ్మ ఇండ్ల పేరిటి ఒక్క ట్రిప్పుకు అనుమతులను తీసుకుని 10 ట్రిప్పులను తరలిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ట్రిప్పుకు రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇండ్లకు ట్రాక్టర్లతో ఇసుక తరలింపు అనుమతిని తాసీల్దార్ విరమించుకోవాలని పేర్కొన్నారు.
బిక్కేరు వాగు నుంచి ఇసుకను ట్రాక్టర్లతో తరలించొద్దని, ఎడ్లబండ్ల ద్వారానే ఇందిరమ్మ ఇండ్లకు అనుమతులు ఇవ్వాలని బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంగ శ్రీను, విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్ల నరేశ్ అన్నారు. తాసీల్దార్ కార్యాలయం వద్ద ఎడ్ల బండ్లతో రైతుల ఆందోళనకు వారు మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరిట ఇసుక మాఫీయాను ప్రోత్సహిస్తోందన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలపై బీఆర్ఎస్ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తొంట శ్రీనివాస్, బుంగ భిక్షం, ముత్యాలు, ఉప్పలయ్య, ఎల్లయ్య, ఎల్.నరేశ్, భాస్కర్, తొంట గిరి, లింగస్వామి, యెర్రవెల్లి నర్సయ్య,లొడంగి మల్లేశ్, దండేబోయిన మల్లయ్య, యాకస్వామి, రాములు, మధు పాల్గొన్నారు.
Motkur : బిక్కేరు వాగు నుంచి ఇసుక తరలించొద్దని ఎడ్ల బండ్లతో నిరసన