బీబీనగర్, మే 21 : రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై నిరసనగా శుక్రవారం బీబీనగర్ పట్టణ కేంద్రంలోని పోచంపల్లి చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించనున్నట్లు రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు తెలిపారు. గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో పోసి వర్షాలు, ఎండల మధ్య కాపలా కాస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. కటింగుల పేరుతో రైతులపై భారాలు మోపుతూ, బస్తాకు అదనంగా రెండు కిలోల ధాన్యం జోకుతూ బహిరంగ దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.
రైతుల చెమటతో పండిన ధాన్యాన్ని కొనకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, రైతాంగాన్ని మోసం చేసే విధానాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహాధర్నా అనంతరం తాసీల్దార్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు గూదే శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, నాయకులు గాదె నరేందర్ రెడ్డి, పిట్టల అశోక్, మంచాల రవికుమార్, పురుషోత్తం రెడ్డి, కొమురె శ్రీకాంత్, కొంతం లింగయ్య గౌడ్, లక్కీ నగేష్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.