యాదగిరిగుట్ట, జనవరి 20 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, విద్యుత్, తాగునీరు, విద్య వంటి మౌలిక సదుపాయాలను విస్తృతంగా కల్పిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు. సైదాపూర్ గ్రామంలో రెండు అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు, అలాగే నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విద్యుత్ సరఫరా ప్రధాన ఆధారమన్నారు. నూతన సబ్ స్టేషన్ ప్రారంభంతో రైతులకు నిరంతర విద్యుత్ అందుబాటులోకి రానుందని, వ్యవసాయ మోటార్లకు లో వోల్టేజీ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అలాగే గృహాలు, చిన్న పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కానున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా రైతుల సంక్షేమం దృష్ట్యా విద్యుత్ రంగంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సబ్ స్టేషన్లు, లైన్ల బలోపేతం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.