– 30 గ్రామ పంచాయతీల్లో 256 పోలింగ్ బూత్‌లు
– పోటీలో 77 మంది సర్పంచ్, 481 మంది వార్డు అభ్యర్థులు
బీబీనగర్, డిసెంబర్ 13 : బీబీనగర్ మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో జిల్లా గ్రామీణ సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలింగ్ అధికారులకు అవసరమైన ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఉన్న 34 గ్రామ పంచాయతీలలో నాలుగు పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 30 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
ఇందుకోసం అధికారులు మొత్తం 256 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 41,154 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ అధికారులు సామగ్రిని సంబంధిత గ్రామ పంచాయతీలకు తరలించి, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో మండల వ్యాప్తంగా 77 మంది సర్పంచ్ అభ్యర్థులు, 481 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీలో ఉన్నారు.