యాదగిరిగుట్ట, జూన్15: మండలంలోని మల్లాపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసు బృందం భగ్నం చేశారు. ఏసీపీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో సీఐలు భాస్కర్, శంకర్ గౌడ్, కొండలరావు, సుమారుగా 50 మంది పోలీసులు, మహిళా పోలీస్ తో కలిసి దీక్ష స్థావరానికి వచ్చి దీక్షలో పాల్గొన్న కర్రె వెంకటయ్యను అరెస్టు చేశారు. టెంట్ ను తొలగించి డీజే బాక్స్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అడ్డుకున్న మహిళలు..
దీక్షలో పాల్గొన్న కర్రె వెంకటయ్యతో పాటు ఇతర ముఖ్య నాయకులు అరెస్టు చేసి తీసుకున్న క్రమంలో మల్లాపురం గ్రామానికి చెందిన మహిళలు తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత బీఆర్ఎస్ పాలలో ఇలాంటి నిర్బంధాలు లేవని, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఓట్లు వేసి చాలా తప్పు చేసామని పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుపై వాళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీక్షలో సుమారుగా 500 మంది మహిళలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.