భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను భూదాన్ పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రతిష్టాత్మక ఎక్స్లెన్స్ అవార్డు 2025ను దక్కించుకుంది. హైదరాబాద్లోని హెచ్ఐసిసి నోవాటెల్లో హై బీచ్ టీవీ సంస్థ, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహించిన పురస్కారాల ప్రధానోత్సవంలో మంగళవారం ఈ అవార్డును అందజేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ, మల్లారెడ్డి విశ్వవిద్యా పీట్ యూనివర్సిటీ చైర్ పర్సన్ డాక్టర్ ప్రీతి రెడ్డి చేతుల మీదుగా పోచంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బి.సురేశ్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సి.రమణి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ అధ్యాపక బృందం కృషి, విద్యార్థుల క్రమశిక్షణ వల్ల ఈ గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఈ పురస్కారం మరింత ఉత్తేజాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ విజయం పట్ల కళాశాల సిబ్బంది, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.