బీబీనగర్, డిసెంబర్ 29 : బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తూ పర్యావరణానికి, గ్రామ ప్రజల జీవనానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని గ్రామస్తులు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామ పరిధిలోని గోల్డెన్ ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు సహా సర్వే నంబర్లు 35, 37, 538, 554, 555, 563, 527, 570 తదితర ప్రాంతాల్లో గత మూడు సంవత్సరాలుగా గ్రామానికి చెందిన కొందరు ఈ అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతూ, టిప్పర్ల ద్వారా భారీగా మట్టిని తరలిస్తూ కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను గ్రామస్తులు పట్టుకుని, డయల్ 100కు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి వచ్చి టిప్పర్లను వెళ్లిపోవాలని చెప్పినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
అనంతరం ఆ మూడు టిప్పర్లను గ్రామానికి తీసుకువచ్చి నిలిపి వేశారు. ఈ విషయమై గతంలోనే ఎంఆర్వో, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా రూ.25 నుంచి 30 కోట్ల విలువైన మట్టిని అక్రమంగా తవ్వి తరలించి సోమ్ము చేసుకున్నారని ఆరోపించారు. మట్టి తవ్వకాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మళ్లీ ఈ సమస్య పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో గ్రామస్తులు బండారు శంకర్ గౌడ్, బుయ్య కిశోర్ గౌడ్, దొంతిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, జక్కి నగేశ్, బండారు రాఘవేందర్ ఉన్నారు.