యాదాద్రి: యాదాద్రిలో భక్తులు ప్రతిష్టాత్మకంగా చేపట్టే సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని యాదగిరిగుట్ట పాత గోశాల వద్ద నిర్మించిన వసతి గృహంలోకి తరలించారు. ప్రస్తుతం తులసీ తోట ప్రాంగణం వద్ద శిల్పారామంలో నిర్వహిస్తు న్న వ్రత మండపాలను శనివారం గోశాల వసతి గృహాలలోకి మార్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొండపైన వ్రత మండపాన్ని ఈ ఏడాది జనవరి 22వ తేదీన కొండ కింద శిల్పారామంలోకి మార్చిన సంగతి విధితమే.
8 నెలలుగా వ్రతాలు కొండ కిందనే కొనసాగుతున్నాయి. శ్రావణమాసంతో పాటు కార్తీక మాసంలో యాదాద్రీశుడి ఆలయంలో పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. ఈ వ్రతాల్లో భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత గోశాల నుంచి సకల వసతులతోపాటు విశాలంగా నిర్మించిన వసతి గృహంలోకి మార్పు చేశారు.
సోమవారం శ్రావణ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్రతాలను ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందు కోసం భక్తులకు సరిపడా వ్రత పీటలు, సామాగ్రి తరలించి, శుభ్ర పరిచే పనులు చేపట్టారు. మండపంలో భక్తులకు కావాల్సిన సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు.