Royal Enfiled Scram 440 vs Yezd Scrambler | భారత మార్కెట్లో అడ్వెంచర్, స్క్రాంబ్లర్ బైక్‌లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా నగర రోడ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని గుంతలు, కంకర రోడ్లు, తేలికపాటి ఆఫ్‌రోడింగ్ పరిస్థితుల్లోనూ స్మూత్ రైడింగ్ సామర్థ్యంతో ఉండటంతో యూత్ స్క్రాంబ్లర్ బైక్‌లవైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ స్క్రామ్ 440ని అందుబాటులోకి తీసుకురాగా.. ఇటీవల యెజ్డీ నుంచి సరికొత్త స్క్రాంబ్లర్ బైక్‌లు వచ్చాయి. ప్రస్తుతం రూ.2.5 లక్షల్లోపు ధరలో ఈ రెండు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో ఏది బెస్ట్ అనేది ఒకసారి పరిశీలిద్దాం..
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440లో 443సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 25.4బీహెచ్పీ పవర్, 34ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు. ముఖ్యంగా తక్కువ ఆర్పీఎం వద్ద ఎక్కువ టార్క్ అందించడం వల్ల కొండ ప్రాంతాలు, కఠినమైన రోడ్లపై ప్రయాణానికి ఇది అనుకూలంగా ఉంటుంది.
అదే యెజ్డీ స్క్రాంబ్లర్ 334 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 29.59బీహెచ్పీ పవర్, 30 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్పరంగా యెజ్డీ స్క్రాంబ్లర్ ముందంజలో ఉండగా, టార్క్ విషయంలో స్క్రామ్ 440 ముందు ఉంది. వేగవంతమైన యాక్సిలరేషన్, హైవే రైడింగ్‌ను ఇష్టపడేవారికి యెజ్డీ బైక్ బాగా నచ్చే అవకాశం ఉంది.
స్క్రామ్ 440లోసీటు ఎత్తు 795 మిల్లీమీటర్ల ఎత్తులోనే ఉండటంతో పొట్టిగా ఉన్నవారు కూడా సులభంగా నడపగలరు. 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లపై ఇబ్బంది ఉండదు. దీని వీల్‌బేస్ 1460 మిల్లీమీటర్లు కాగా.. మొత్తం బరువు 196 కిలోలు.
యెజ్డీ స్క్రాంబ్లర్‌లో సీటు ఎత్తు 813 మిల్లీమీటర్ల ఎత్తులో ఉంది. పొడవుగా ఉండే వారికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది. బరువు విషయానికి వస్తే ఇది స్క్రామ్ 440 కంటే తక్కువ. దీని బరువు కేవలం 174 కిలోలు మాత్రమే. స్క్రామ్తో పోలిస్తే 22 కిలోల వరకు తక్కువ బరువు ఉండటంతో ట్రాఫిక్‌లో, టార్నింగ్స్లో మరింత చురుకైన హ్యాండ్లింగ్ ఉంటుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440లో ముందు 300మిల్లీమీటర్ల డిస్క్, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ముందు 41 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక లింకేజ్‌తో కూడిన మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. ముందు 190మిల్లీమీటర్లు, వెనుక 180 మిల్లీమీటర్ల సస్పెన్షన్ ట్రావెల్ ఉండటంతో కఠినమైన రోడ్లపై కూడా మంచి సౌకర్యవంతమైన రైడింగ్‌ను అందిస్తుంది.
యెజ్డీ స్క్రాంబ్లర్‌లో ముందు 320 మిల్లీమీటర్లు, వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ భద్రత కూడా ఉంది. ముందు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షార్క్ అబ్జార్బర్ల వ్యవస్థను ఉపయోగించారు.
స్క్రామ్ 440లో 15లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. యెజ్డీ స్క్రాంబ్లర్‌లో 12.5 లీటర్ల ట్యాంక్ మాత్రమే ఉంది. అయితే తక్కువ బరువు కారణంగా ఇంధన వినియోగం కొంత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ.2.23 లక్షలుగా ఉంది. అదే యెజ్డీ స్క్రాంబ్లర్ ప్రారంభ ధర రూ.1.99 లక్షలుగా ఉంది. అంటే యెజ్డీ బైక్ సుమారు రూ.24వేల తక్కువ ధరలో లభిస్తుంది.
వీటన్నింటి ఆధారంగదా బలమైన నిర్మాణం, అధిక టార్క్, టూరింగ్ సామర్థ్యం ముఖ్యమైతే రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 సరైన ఎంపిక అని ఆటోమొబైల్ నిపుణులు సూచిస్తున్నారు. అదే తక్కువ బరువు, ఎక్కువ పవర్, చురుకైన హ్యాండ్లింగ్, తక్కువ ధరలో స్క్రాంబ్లర్ కావాలనుకుంటే యెజ్డీ బెటర్ అని చెబుతున్నారు.