రామన్నపేట, జులై 03 : రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రామన్నపేట -అమ్మనబోలు ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేశ్, శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం దుబ్బాక గ్రామ శాఖ ఆధ్వర్యంలో గుంతలమయమైన రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట- అమ్మనబోలు రోడ్డు వర్షాలకు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతుందన్నారు.
అనేకసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. వర్షం వస్తే రోడ్లు మొత్తం చెరువుమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వెంటనే అధికారులు నూతన రోడ్డును వేయాలన్నారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలను సమీకరించి రామన్నపేట ఆర్&బి కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు గట్టు నరసింహ, పైళ్ల పాపయ్య, డీవైఎఫ్ఐ నాయకులు గుండాల నరేశ్, గుండాల అనిల్, పుట్టల ఉదయ్ కుమార్, గాదె రాజకుమార్, గట్టు సుందర్, పైళ్ల లింగస్వామి, గుండాల అక్షిత, గట్టు రమణ, గుండాల సాయి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.