– ఇప్పటికే భూముల్లో అధికారుల సర్వేలు
– ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు
– బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వాలని డిమాండ్
బీబీనగర్, జూన్ 15 : బీబీనగర్ పట్టణ కేంద్రంలో ప్రతిపాదిత ఎంఎంటీఎస్ విస్తరణ పనుల కోసం ఇళ్లు, నివాస ప్లాట్లు కోల్పోతున్న బాధితుల్లో ఆందోళన నెలకొంది. తమ ఆస్తులకు ఎంత పరిహారం చెల్లిస్తారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించకుండా సర్వేలు నిర్వహిస్తుండడంపై ఆందోళన రేకెత్తుతున్నది. ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.
ఎంఎంటీఎస్ – 2 ప్రాజెక్ట్ రాయగిరి వరకు విస్తరించాలని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే బీబీనగర్ లో భూములు, ప్లాట్లు కోల్పోవాల్సి వస్తున్నది. ఇప్పటికే అధికారులు సర్వేలు నిర్వహించి వివరాలు సేకరించినప్పటికీ, బాధితులకు ఎలాంటి అధికారిక సమాచారం అందించలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రజాప్రయోజనాల కోసం చేపట్టే అభివృద్ధి పనులకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కోరుతున్నారు. అసలు ఏమేమి ఆస్తులు తీసుకుంటున్నారు..? కోల్పోతున్న ఆస్తులకు ఏ చట్టంప్రకారం..? ఎంత పరిహారం ఇస్తారు..? అనే వివరాలపై ఇప్పటి వరకు అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు.
ఎంఎంటీఎస్ విస్తరణతో పట్టణ అభివృద్ధి, రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నప్పటికీ, తమ ఆస్తులు కోల్పోతున్న కుటుంబాల్లో భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. బాధితులు ఇప్పటికే ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఆర్డీఓను వేర్వేరుగా పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఆస్తులు కోల్పోతున్న బాధితులకు న్యాయం చేయాలని, తమ ఆస్తుల విలువకు తగిన పరిహారం అందజేయాలని కోరినప్పటికీ, ఇప్పటి వరకు పరిహారం మొత్తం, చెల్లింపు విధానం, పునరావాస అంశాలపై స్పష్టత రాలేదని ఆరోపిస్తున్నారు.
ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించింది. ఎంఎంటీఎస్ విస్తరణ కోసం అధికారులు సర్వే చేపట్టిన సమయంలో ఈ ప్రాంతంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం గజం విలువ సుమారు రూ.2,100 ఉండగా ప్రస్తుతం సవరించిన మార్కెట్ విలువ ప్రకారం గజం ధర రూ.3,200కు చేరింది. అయితే వాస్తవ మార్కెట్ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బీబీనగర్ పరిసర ప్రాంతాల్లో కనీసం గజం ధర రూ.20 వేల కంటే తక్కువగా లేదని, ఎంఎంటీఎస్ ప్రాజెక్టు కారణంగా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో గజం ధర రూ.25 వేల వరకు పలుకుతోందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించే పరిహారం మార్కెట్లో ఉన్న వాస్తవ ధరలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన బాధితుల్లో వ్యక్తమవుతోంది. తమ ఆస్తులు కోల్పోతున్న నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలని, పరిహారం నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మా కుటుంబం చాలా ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తోంది. ఇప్పుడు ఎంఎంటీఎస్ విస్తరణలో మా ఇల్లు ప్రభావితమవుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ ఎంత పరిహారం ఇస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, ప్రత్యామ్నాయంగా ఏమైనా సౌకర్యాలు కల్పిస్తారా అనే విషయాలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మెల్యే, ఎంపీ, జిల్లా కలెక్టర్, ఆర్డీఓలను పలుమార్లు కలిసి వినతిపత్రాలు అందజేశాం. అయినప్పటికీ బాధితులకు పూర్తి సమాచారం అందడం లేదు. అభివృద్ధి పనులకు మేము వ్యతిరేకం కాదు. కానీ మా జీవితకాల సంపాదనతో నిర్మించుకున్న ఇంటిని కోల్పోతున్నందున ప్రభుత్వం న్యాయమైన నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి.
మా ప్లాటు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చిందని అధికారులు సర్వే నిర్వహించారు. కానీ పరిహారం ఎంత ఇస్తారు, ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం బీబీనగర్ పరిసర ప్రాంతాల్లో గజం ధర రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతోంది. ఎంఎంటీఎస్ ప్రాజెక్టు రావడంతో భూముల విలువ మరింత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పరిహారం మార్కెట్లో ఉన్న వాస్తవ ధరలకు సరిపోదనే భయం మాలో ఉంది. మా ఆస్తులు కోల్పోతున్నందున బహిరంగ మార్కెట్లో ఉన్న వాస్తవ ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయాలి. అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధితులతో సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించాలి.