యాదగిరిగుట్ట, జూలై 17 : యాదగిరిగుట్ట పట్టణం వైటీడీఏ పరిధిలోని పాత గోశాల ప్రాంతంలో రెండు ఎకరాల్లో ఆప్టిమస్ పార్మాస్యూటికల్స్, ఏజీఐ గ్యాస్ ప్యాక్ సంస్థల ఆర్థిక సహాకారంతో నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని గురువారం రాష్ట్ర అగ్నిమాపక ప్రమాద విపత్తు, పౌర రక్షణ విభాగం డైరక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. అనంతరం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. ఏదైనా విపత్తు సంభవిస్తే తక్షణమే స్పందించే అగ్ని మాపక కేంద్రానికి సొంత భవనాన్ని నిర్మించుకోవడం సంతోషదాయకమన్నారు.
భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు అభినందనలు తెలుపుతూ వారిని శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అగ్నిమాపక రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ప్రసన్న కుమార్, జిల్లా అధికారి మధుసూదన రావు, ఏజీఐ గ్లాస్ ప్యాక్టరీ ఎండీ దుర్గాప్రసాద్, అప్టిమస్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ ఉమారావు, అగ్నిమాపక శాక అధికారులు పాల్గొన్నారు.