యాదాద్రి, ఆగస్టు 4 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి నిత్యపూజలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మొల్కొల్పి తిరువారాధన చేసి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం నిర్వహించారు. స్వామికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ఉత్తర దిశ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. సాయంత్రం స్వామివారికి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధన ఘనంగా నిర్వహించారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. శ్రీవారి ఖజానాకు రూ. 13,13,286 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.