యాదాద్రి, జూన్ 8 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్లకు బుధవారం శాస్ర్తోక్తంగా నిత్యారాధనలు జరిపించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు ఘనంగా జరిపించారు. మొదటగా స్వామికి సుదర్శన నారసింహ హోమం చేశారు. స్వామి నిత్యపూజలు వేకువజామున 3.30గంటలకు ప్రారంభమయ్యాయి. స్వయంభువులను ఆరాధించి పంచామృతాలతో అభిషేకించి, తులసీ అర్చనలు చేశారు. అనంతరం లక్ష్మీనృసింహులను దివ్య మనోహరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు.
సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామికి సహస్రనామార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు. పర్వతవర్ధిణీ సమేత రామలింగేశ్వరాలయంలో నిత్యారాధనలు శైవ సంప్రదాయ ప్రకారం నిర్వహించారు. పాతగుట్ట ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా జరిపించారు. సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీవారి ఖజానాకు రూ.13,98,121 ఆదాయం వచ్చినట్లు ఇన్చార్జి ఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు.

శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా : 1,44,100
వీఐపీ దర్శనం :75,000
వేద ఆశీర్వచనం :7,800
నిత్యకైంకర్యాలు :300
క్యారీబ్యాగుల విక్రయం : 9,000
వ్రత పూజలు :76,800
కల్యాణకట్ట టిక్కెట్లు :18,000
ప్రసాద విక్రయం : 6,38,150
వాహనపూజలు :1,900
అన్నదాన విరాళం :46,857
సువర్ణ పుష్పార్చన :98,664
యాదరుషి నిలయం :39,240
పాతగుట్ట నుంచి :19,310
కొండపైకి వాహన ప్రవేశం : 1,75,000
లక్ష్మీపుష్కరిణి :500