వలిగొండ, డిసెంబర్ 6 : అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్న సామెతలా ఉంది వలిగొండ గ్రామ పంచాయతీ పాలకమండలి పనితీరు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ప్రవేశపెట్టి నెలనెలా కావాల్సిన నిధులు ఇస్తుండడంతో మారుమూల పల్లెలు సైతం అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయి. పరిశుభ్రత, పచ్చదనంతో గ్రామాలు ఆహ్లాదకరంగా మారాయి. కానీ.. జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీల్లో ఒకటైన వలిగొండలో మాత్రం పాలక మండలి నిర్లక్ష్యంతో పారిశుధ్యం పడకేసింది. పది మంది పంచాయతీ సిబ్బంది ఉన్నా.. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, అడుగడుగునా పారిశుధ్య లోపం కనిపిస్తున్నది. జంగాల కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ లేక జనావాసాల మధ్య నుంచే మురుగు నీరు ప్రవహిస్తుంది. గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో మురుగు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారాయి. 5వ వార్డులో చేపట్టిన అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో లోతట్టు ప్రాంతంలో మురుగు నిలిచి కంపు కొడుతున్నది. ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రోజూ చెత్త తరలించాలి
కాలనీలో మోరీలు లేక బజార్ల వెంట పారుతున్న మురుగుతో తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. చెత్తను రోజూ తీయకపోవడంతో పందులు చిందరవందర చేస్తున్నాయి. దోమల సమస్య ఎక్కువగా ఉంది. పంచాయతీ సిబ్బంది రోజూ చెత్త తరలించాలి. వీధులను శుభ్రం చేయాలి.
మురుగు సమస్య పరిష్కారానికి కృషి
దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ప్రతి రోజూ గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తారు. డ్రైనేజీలను క్లీన్ చేయిస్తున్నాం. ప్రజారోగ్యానికి, పారిశుధ్యానికి తొలి ప్రాధాన్యమిస్తాం. రేగులకుంటలో మురుగు నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా.