రాజాపేట, జనవరి 22 : లక్షలాదిగా తరలివచ్చే చిన్న మేడారం జాతరకు శాంతిభద్రతల విషయంలో ప్రజలు సహకరించాలని యాదగిరిగుట్ట రూరల్ సీఐ మాదాసు శంకర్ గౌడ్ కోరారు. గురువారం రాజాపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చిన్న మేడారం సమ్మక్క సారక్క జాతర నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమ్మక్క సారక్కలు గద్దెలపై తీసుకొస్తున్న క్రమంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా జాతర సజావుగా కొనసాగేలా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని కోరారు. అందరూ కలిసిమెలసి జాతరను విజయవంతం చేయాలన్నారు. జాతరకు విచ్చేసే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తాసీల్దార్ ప్రదీప్, తుర్కపల్లి ఎస్ఐ తయూద్దీన్, సర్పంచులు చింతల సంపత్, బొడ్డు భాస్కర్, ఆర్ఐ నరసింహులు, వివిధ శాఖల అధికారులు, జాతర ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.