సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 16 : ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిధులెవరు ఇస్తారని, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడు నియోజకవర్గం నాశనం అవుతుందే తప్పా, ఎప్పటికీ అభివృద్ధి జరుగదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకార్‌రెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలం కంకణాలగూడెంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. గతంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసింది రూ.18 వేల కోట్ల కోసమే అన్నారు. గత 20 నెలల్లో మునుగోడులో కొత్తగా ఒక్క శంకుస్థాపన కూడా చేయలేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది తామేనని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి తనకు ప్రభుత్వం సహకరిస్తలేదని అంటున్నాడు.. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి ప్రాంత సమస్యలను చెబితే నిధులు వస్తాయన్నారు.
ఇంతవరకు ఒక మంత్రిని కూడా తాను ఇక్కడికి తీసుకురాలేదన్నారు. చివరికి తన అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డినైనా ఒక్కసారైనా నియోజకవర్గానికి తీసుకొచ్చావా అని ఆయన ప్రశ్నించారు. మునుగోడుకు రాజగోపాల్‌రెడ్డి తానే మంత్రి తానే రాజు అనుకుంటున్నట్లు తెలిపారు. మంత్రులను, ఎంపీలను ఎవరిని కూడా రానివ్వకుండా చేస్తున్నట్లు దుయ్యబట్టారు. నిద్రలో కూడా మంత్రి పదవి కోసమే కలవరిస్తడన్నారు. మంత్రి పదవిఫై ఉన్న యావ ఈ ప్రాంత అభివృద్ధి మీద లేకపాయే అని ఎద్దేవా చేశారు.
గతంలో మిగిలిపోయిన కాంట్రాక్ట్‌ల కోసమే మళ్లీ రాజీనామా డ్రామా మొదలుపెట్టాడని తెలిపారు. తాను రాజీనామా చేస్తాడో.. ఇంకేం చేస్తాడో గానీ మునుగోడు అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. సుశీలమ్మ ఫౌండేషన్‌కి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పాలన్నారు. గతంలో సీఎస్ఆర్ ఫండ్స్ కింద కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడని అభివృద్ధి చేయలేడు అనేదానికి నిదర్శనం ఆయన మాటలే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుండడంతో మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.