మోత్కూరు, మార్చి 26 : మోత్కూరు మండలాన్ని నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు మోత్కూరుకు వచ్చిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనుకబడిన మోత్కూరు అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందన్నారు. మోత్కూరు నియోజకవర్గంగా లేకపోవడం వల్ల విద్యా, వైద్య, రవాణామార్గంగా ఇక్కడ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు (ఎం), గుండాల, అడ్డగూడూరు, మోటకొండూర్ మండలాలను కలిపి మోత్కూరు నియోజకవర్గంగా ఏర్పడితే ఆయా మండలాల ప్రజలకు మంచి సౌకర్యం ఉంటుందన్నారు.
ఈ 5 మండలాలలో 90 గ్రామ పంచాయతీలు 68 రెవెన్యూ గ్రామాలు ఉన్నట్లు తెలిపారు. నాడు రామన్నపేట, నేడు తుంగతుర్తి నియోజకవర్గంలో పెద్ద మండలమైన మోత్కూరు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉందన్నారు. మోత్కూరు నియోజవర్గం ఏర్పాటుకు శాసనమండలిలో ప్రస్తావించాలని ఎమ్మెల్సీ సత్యంను కోరగా ఆయన హామీ ఇచ్చినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ సాధన సమితి జిల్లా నాయకులు కలిమెల నర్సయ్య, స్థానిక నాయకులు ఎడ్ల నరేశ్, అన్నెపు భాస్కర్, ఎడ్ల పక్కిరు పాల్గొన్నారు.