యాదగిరిగుట్ట, మే 22 : ఖబర్దార్ బీర్ల అయిలయ్య.. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడూ, కేటీఆర్ నాలుక కోసే దమ్ముందా? అంటూ ప్రభుత్వ విప్, అలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై బీఆర్ఎస్ పార్టీ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు, కురుమ సంఘం రాష్ట్ర నాయకుడు కర్రె వెంకటయ్య విరుచుకుపడ్డాడు. మాజీ మంత్రి, కేటీఆర్‌కు వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే గ్రామాల్లో ఎక్కడిక్కడ అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. కేటీఆర్‌పై బీర్ల అయిలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం యాదగిరిగుట్ట పట్టణంలో సుమారు 600 మంది పార్టీ శ్రేణులతో కలిసి బీర్ల అయిలయ్య దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద నుంచి స్వామివారి వైకుంఠ ద్వారం వరకు ర్యాలీ చేపట్టారు. పాత గుట్ట చౌరస్తా వద్ద అయిలయ్య దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఎంపీడీఓ కార్యాలయం వద్దకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. అక్కడే ప్రధాన రోడ్డుపై బైఠాయించి క్షమాపణలు చెప్పాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో అక్కడి చేరుకున్న సీఐ భాస్కర్, ఎస్ఐ ఉదయ్ వారిని అరెస్టు చేసి తరలించారు. అనంతరం కర్రె వెంకటయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిని ఐటీ హబ్‌గా మార్చి, ఎన్నో ప్రపంచ అగ్రగామి సాఫ్ట్వేర్ కంపెనీలను హైదరాబాద్‌లో స్థాపించేలా చేసి వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేటీఆర్ ది అని కొనియాడారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన నాయకుడి నాలుక చీరెస్తా అంటావా? నీ నాలుకను నియోజకవర్గ ప్రజల మూత్రంతో కడిగేందుకు వెనుకాడబోమన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయ చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి అయిలయ్య చేసింది శూన్యం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో యాదగిరిగుట్టకు మంజూరైన వైద్య కళాశాల ఏమైందని ఆయన ప్రశ్నించారు. గుట్ట అభివృద్ధిలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 10 శాతం పనులకు రూపాయి కేటాయించని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మోచేతి నీళ్లుతాగే నువ్వు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. రేవంత్‌రెడ్డి రాష్ట్రంపై, మంత్రులు ఉమ్మడి నల్లగొండ జిల్లాపై, నీవు అలేరు నియోజకవర్గంపై పడి దోచుకుతింటున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు లేక గ్రామాలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయన్నారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతాంగం స్వర్ణ యుగాన్ని చూస్తే 17 నెలల్లోనే రాక్షస రాజ్యాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. త్వరలో నువ్వు చేస్తున్న అవినీతిపై నియోజకవర్గ పాదయాత్ర చేపట్టి ప్రచారం చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేసిన భూకబ్జాలు, అక్రమ దందాలపై ప్రచారం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి కొండల్ రెడ్డి, నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, కసావు శ్రీనివాస్, ఆవుల సాయి, కవిడే మహేందర్, ముఖ్యర్ల సతీశ్, అదె శ్రీదర్, సయ్యద్ బాబా, కాటేకార్ పవన్, అరే మల్లేశ్, ముగిలిపాక రమేశ్, శారాజీ రాజేశ్, మల్లేశ్, చిత్తర్ల బాలయ్య, శిఖ శ్రీనివాస్, అంకం నర్సింహ, అరే స్వామి, గడ్డం చంద్రం, గుణగంటి బాబారావు, పాండవుల భాస్కర్ పాల్గొన్నారు.