జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష వైఖరిని ఎప్పటికప్పుడు ప్రజలలోకి తీసుకెళ్లాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఎవరితోనైనా కొట్టాడుతాం. పంజాబ్ రాష్ట్రంలో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా కేంద్రం కొనుగోలు చేయాలి. కరోనా సమయంలో దేశం మొత్తంలో ధాన్యం కొనుగోలు ఆగిపోగా కేవలం తెలంగాణలో గింజ లేకుండా కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశంలో అగ్రగామిగా నిలిచాం. కేంద్ర మంత్రులు రైతులను మోసం చేస్తున్నారు. బీజేపీ పార్టీకి రైతులపై ప్రేమ లేదు. రైతు చట్టాలను, విద్యుత్ చట్టాలను తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. దేశంలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నల్ల డబ్బు తెస్తా.. ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజలను మోసం చేసాడు. నోట్ల రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఉద్ధరించింది. దేశ యువత కోసం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోదీ మోసం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం. బీజేపీ మాట్లాడేది దేశ భక్తి.. చేసేది దేశ ద్రోహం.. అని మంత్రి దుయ్యబట్టారు.