రాజాపేట, ఏప్రిల్ 08 : పని ప్రదేశాల్లో ఉపాధి హామీ కూలీలకు కనీస వసతులు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జూకంటి పౌల్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూలీలకు ఎలాంటి నీడగాని, అన్నం తినడానికి మంచినీళ్లు గాని, ప్రమాదం జరిగితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా లేదన్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఆశా వర్కర్ల ద్వారా మెడికల్ కిట్‌ను అందేలా చూడాలన్నారు. అదేవిధంగా కొలతలు లేకుండా డబ్బులు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని, రోజు కూలి పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.800 ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ గాని, టెక్నికల్ అసిస్టెంట్ గాని, ఎంపీడీఓ గాని సందర్శించి కూలీలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పని ప్రదేశంలో గ్రామ పంచాయతీ నుండి మంచినీళ్లు ఏర్పాటు చేయాలన్నారు.పెద్ద కాల్వ పనిచేసే వారికి కూడా ఐదు కిలోమీటర్ల దూరం ఉండడంతో రవాణా బత్యం ఇవ్వాలన్నారు. గతంలో సింగారం గ్రామంలో వడదెబ్బకు ఉపాధి కూలీ చనిపోవడం బాధాకరమన్నారు. ఆమెకు వెంటనే ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్. చేశారు. ఈ కార్యక్రమంలో కట్ట లక్ష్మి, మానస, చింతకాయల రవి, నీలం మధు, ఐదు మల్లయ్య పాల్గొన్నారు.