రామన్నపేట, అక్టోబర్ 10 : ప్రతి ఒక్క మానవునికి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం అని సీనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.సబిత అన్నారు. మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం రామన్నపేట కోర్టు ప్రాంగణంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మజీద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.సబిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శిరీష హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జి మాట్లాడుతూ.. పుట్టుకతో వచ్చిన మానసిక వైకల్యమే కాదు సాఫీగా సాగుతున్న జీవితంలో ఎదురయ్యే సమస్యల వల్ల కూడా మానసికంగా అనారోగ్యం పాలవుతారన్నారు.
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి మానసికంగా, శారీరకంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా ఉండాలంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలన్నారు. ఏ ఒక్కటి కూడా సపోర్ట్ చేయకపోయినా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. జీవితాలు కోల్పోయే అవకాశం ఉన్నదన్నారు. ఎవరైనా మానసికంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే అటువంటివారికి సైకలాజికల్ గా చికిత్స అందితే వారి జీవితాలు సాఫీగా సాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ రామదాసు, ఎన్.స్వామి, రమేష్, లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.