రాజాపేట, మే 27 : తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీల్లో ఐదు సంవత్సరాల పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మాజీ సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు గాంధేయ మార్గంలో ప్రజాభవన్ వద్ద నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న మాజీ సర్పంచులను ముందస్తుగా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సర్పంచులు అప్పులు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ.1,500 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, బిల్లులు అందక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా బిల్లులు చెల్లించకపోవడం తాజా మాజీ సర్పంచులను తీవ్ర మనోవేదనకు గురి చేస్తుందన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన మాజీ సర్పంచులు నాగిర్తి గోపిరెడ్డి, చెరుకు విజయకనకయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, జలసాధన సమితి కన్వీనర్ ఎర్రగోకుల జశ్వంత్, మాజీ ప్రజా ప్రతినిధుల సంఘం జిల్లా అధ్యక్షుడు బొంగోని ఉప్పలయ్య గౌడ్, బీఆర్ఎస్ మండల నాయకుడు యమ్మ భాస్కర్, సీపీఐ మండల కార్యదర్శి చిగుళ్ల లింగం సంఘీభావం తెలిపారు.