భూదాన్ పోచంపల్లి, జనవరి 17 : పోచంపల్లి మున్సిపాలిటీలో క్రయ విక్రయాలు చేయకూడదంటూ రెవెన్యూ అధికారులు రూపొందించిన 644 నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కాలనీలో శనివారం కాలనీవాసులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి మాట్లాడుతూ… గత 50 ఏళ్లుగా నివాసముంటున్న ఇళ్ల మీద హక్కు కల్పించాలని, నిషేధిత జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న ఇండ్లతో పాటు, సొంత పట్టా భూముల్లో స్థలాలు కొనుక్కొని నిర్మించుకున్న ఇండ్లను 22- ఏ నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు.
నిషేధిత ఇళ్ల జాబితాను రద్దు చేసేంత వరకు ఆందోళనను ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోరుగంటి నరసింహ, తంతరపల్లి రంగయ్య, ఇంజమూరి యాదగిరి, పొనమోని సహదేవ్, గోలి సిద్ధులు, మంచి కట్ల రామస్వామి, పోశం యాదగిరి, గోరుగంటి అశోక్, బాతుక శ్రీను, చిటుకుల నరేశ్, సోలాపురం సిటీ రాములు, సైదు గాని శ్రీకాంత్, చేరాల బుచ్చయ్య, కాలనీవాసులు, యువకులు పాల్గొన్నారు.