రాజాపేట, అక్టోబర్ 10 : బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూకంటి ప్రవీణ్ కుమార్ అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని గాంధీ కూడలిలో బీసీ నేతలు ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఒక్క శాతం తగ్గినా రాష్ట్రంలో ప్రళయమే సృష్టిస్తామని హెచ్చరించారు.
కోర్టులను అడ్డం పెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని కుట్రలు పన్నితే బీసీల అగ్రహాన్ని గురికాక తప్పదన్నారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పార్టీలకతీతంగా బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్, సంధిల భాస్కర్ గౌడ్, దాచేపల్లి రాజు, సూరారం వెంకటేశ్, చిగుళ్ల బీరయ్య, కాకల్ల నవీన్, గౌర బక్కయ్య, వస్పరి సుధాకర్, అఖిలపక్ష నేతలు బొంగోని ఉప్పలయ్య, ఎర్ర గోకుల జస్వంత్, గుర్రం నరసింహులు, ఏమ్మ భాస్కర్, బిర్రు లవన్, గజ్జల రాజు, పాండవుల వెంకటేశ్ పాల్గొన్నారు.