భువనగిరి కలెక్టరేట్, జూన్ 19 : రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతులందరూ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని యదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం భువనగిరి మండలంలోని చీమలకొండూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారా లేదా అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జ్రాగత్తగా వ్యవహరించాలని సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్, రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సదస్సులో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు తప్పనిసరిగా పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తాసీల్దార్ కళ్యాణ్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.