ఆత్మకూరు(ఎం), అక్టోబర్ 15 : కూరెళ్ల నుండి రాఘవపురం, నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టును హై లెవల్ బ్రిడ్జిగా మార్చాలని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కూరేళ్ల గ్రామంలో ఉన్న కల్వర్టును ఇతర ప్రజా సంఘాలతో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రధానంగా కూరెల్ల గ్రామం నుండి రాఘవాపురం, నర్సాపురం గ్రామాలకు వెళ్లడానికి ప్రధాన రహదారిగా కల్వర్టు ఉంది. కానీ చిన్నపాటి వర్షానికి కల్వర్టు మొత్తం గుంతలమయంగా మారి పైనుండి వర్షపు నీరు, మొగుళ్ల చెరువు, ఎల్లమ్మ చెరువు నీరు, కాల్వ నీరు పోవడం మూలంగా కల్వర్టు మొత్తం ధ్వంసమై అనేక ప్రమాదాలకు కారణమయ్యిందన్నారు. రాఘవపురం, నర్సాపురం గ్రామాల నుండి విద్యార్థులు, వ్యాపారస్తులు, ఎడ్లవారిగూడెం పరిసర ప్రాంత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
అదేవిధంగా విద్యార్థులు పాఠశాల చదువులకు దూరమై, రైతులు పంట పొలాలకు దూరమై.. జీవాలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే ఇప్పటివరకు నెరవేర్చకపోవడం శోచనీయమన్నారు. వెంటనే కూరెళ్ల నుండి నర్సాపురం, రాఘవపురం కల్వర్టును హైలైవెల్ బ్రిడ్జిగా మార్చి రైతులు, విద్యార్థులు, ప్రజల ఇబ్బందులు తీర్చాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వేముల భిక్షం, సీనియర్ నాయకులు భాషబోయిన రాములు, బండా బీరయ్య, నాయకులు గడ్డం నాగేశ్, ఏళ్లంకి స్వామి, వెంకటయ్య, బండ శివయ్య, నిమ్మల సత్తయ్య, మహేశ్, మేకల పాండు పాల్గొన్నారు.